పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఏ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారి పరిచయము
పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఏ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు భారతదేశములోని కలకత్తా నగరములో 1896 వ, సంవత్సరములో జన్మించిరి. వారు తమ ఆధ్యాత్మికాచార్యులైన శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతీ గోస్వామి వారిని కలకత్తాలో 1922 వ, సం.లో మొదటిసారి కలుసుకొనిరి. శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతుల వారు ప్రముఖ వైదిక విద్వాంసులు, 64 గౌడీయ మఠాలను (వైదిక సంస్థలను) స్థాపించిరి. వారు విద్యాసంపన్నులు, యువకుడైన ప్రభుపాదుల వారిని చూచి సంతోషించి, వైదిక విజ్ఞానమును బోధించుటకు తన జీవితమును అంకితము చేయమని వారిని ఒప్పించిరి. ఆనాటినుండి శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతీ ఠాకూరు వారికి శిష్యులై, 1933లో పద్ధతి ప్రకారము దీక్షాశిష్యులైరి.
తొలి సమావేశములోనే శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతీ ఠాకూరుల వారు ఆంగ్ల భాష ద్వారా వైదిక విజ్ఞానమును ప్రచారము చేయమని శ్రీల ప్రభుపాదుల వారిని కోరిరి. తరువాతి సంవత్సరాలలో శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీతకు భాష్యమును రచించి, గౌడీయమఠ కార్యక్రమములకు తోడ్పడసాగిరి. 1944లో 'బ్యాక్ టు గాడ్‌హెడ్' (భగవద్దర్శనము) అనే ఆంగ్లపక్ష పత్రికను స్థాపించిరి. అది ఇప్పుడు పాశ్చాత్యదేశాలలో వారి శిష్యుల చేత ముప్పైకి పైగా భాషలలో కొనసాగించ బడుతుండెను.
శ్రీల ప్రభుపాదుల వారి భక్తిజ్ఞానములను గుర్తించి 1947లో గౌడీయ వైష్ణవ సంఘము, వారిని 'భక్తివేదాంత' బిరుదుతో సత్కరించిరి. 1950 లో, 54 సంవత్సరాల వయస్సులో శ్రీల ప్రభుపాదుల వారు వైవాహిక జీవితమును త్యజించి తమ అధిక సమయము గ్రంథపఠనకు, రచనకు వినియోగించిరి. తరువాత వారు వృందావనముకు వెళ్ళి అక్కడ మధ్యయుగములో చరిత్ర ప్రసిద్ధి గాంచిన శ్రీశ్రీ రాధా దామోదర మందిరములో అతిసామాన్య జీవితమును గడిపిరి. అక్కడే వారు అనేక సంవత్సరాలపాటు నిరంతర విద్యావ్యాసంగము చేసి అనేక గ్రంథములను రచించిరి. 1959లో సన్న్యాసమును స్వీకరించిరి. వారి జీవితపు ప్రధాన రచనయైన శ్రీమద్భాగవతములోని 18,000 శ్లోకాలకు అనువాదము, వ్యాఖ్యానాలతో కూడిన అనేక సంపుటములుగా రచనను ఆరంభించిరి. అట్లే గ్రహాంతర సులభయానము అనే మరొక గ్రంథమును కూడ రచించిరి.
శ్రీమద్భాగవతము మూడు సంపుటములు ప్రచురింపబడిన తరువాత ప్రభుపాదుల వారు తమ ఆధ్యాత్మికాచార్యుల వారి కోరికను నెరవేర్చుట కొరకై 1965లో అమెరికా సంయుక్త రాష్ట్రాలకు బయల్దేరిరి. ఆనాటి నుండి వారు భారతీయ వేదాంత గ్రంథములపై ప్రామాణిక వ్యాఖ్యానాలను, భాషాంతరీకరణాలను, సంగ్రహ వ్యాఖ్యలను 70 సంపుటములకు పైగా రచించిరి.
1965 లో మొట్టమొదటిసారిగా ఒక వాణిజ్యనౌకలో న్యూయార్కు నగరమునకు వెళ్ళినప్పుడు వారి వద్ద ఏ మాత్రము ధనము లేదు. తరువాత ఒక సంవత్సరముకు అనగా 1966 జూలైలో వారు అతికష్టము మీద అంతర్జాతీయ కృష్ణచైతన్య సంఘమును (ఇస్కాన్) సంస్థాపించగలిగిరి. పది సంవత్సరములకు లోపలే ఆ సమాజము ఎంతగానో అభివృద్ధి చెంది ప్రపంచమంతటా విస్తరించసాగెను. గురుకులములు, మందిరములు, ఆశ్రమములు వంటివాటిని నెలకొల్పసాగెను.
1968లో, శ్రీల ప్రభుపాదుల వారు న్యూవర్జీనియాలోని కొండలపైన ఆధ్యాత్మిక సమాజమును స్థాపించి దానికి నూతన వృందావనముగా నామకరణము చేసిరి. అక్కడే ఒక వైదిక గురుకులమును నెలకొల్పి పాశ్చాత్య దేశవాసులకు సైతము వైదిక గురుకుల విద్యావిధానమును అందుబాటులోకి తెచ్చిరి. ఆ నూతన వృందావనము ఇప్పుడు వేయి ఎకరములకు పైగా విస్తీర్ణము గల ప్రదేశములో విరాజిల్లుతుండెను. అమెరికాలోని వారి శిష్యులు అలాంటి సంఘముల నెన్నింటినో స్థాపించిరి.
1972లో, పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఏ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలలోని డెల్లాస్, టెక్సాస్‌లలో వైదిక పద్ధతిలో గురుకులములను ఏర్పాటు చేసిరి. 1972లో ముగ్గురు విద్యార్థులతో ఆరంభమైన గురుకులము 1975 నాటికి 150 మంది విద్యార్థులతో విరాజిల్లెను.
శ్రీల ప్రభుపాదుల వారు భారతదేశములో అంతర్జాతీయ సంఘములను నిర్మింపచేయుటకు ప్రోత్సహించిరి. పశ్చిమ బెంగాలులోని మాయాపూరులో శ్రీధామమనే అంతర్జాతీయ ఆధ్యాత్మిక సంఘమును నిర్మింపదలిచిరి. మిక్కిలి విశాలమైన ఆ పథక నిర్మాణముకు చాలాకాలము పట్టవచ్చును. అది వైదిక శాస్త్రపఠనముకు కూడ అనుకూలముగా నిర్మించబడును. భారతదేశములోని వృందావనములో మహోన్నతమైన కృష్ణబలరామ మందిరము ఆ విధానమును అనుసరించియే నిర్మించబడెను. అంతేకాకుండ అక్కడ ఒక అంతర్జాతీయ అతిథి గృహము కూడ నిర్మించబడెను. పాశ్చాత్య దేశవాసులకు అక్కడి నుండి వైదిక సంస్కృతిని ప్రత్యక్షముగా నేర్చుకునే అవకాశము కలుగును. ముంబాయిలో ప్రధాన సాంస్కృతిక విద్యాకేంద్రము కూడ కలదు. భారతదేశములో అనేక ప్రధాన ప్రదేశాలలో ఇతర సంఘముల నిర్మాణము కొనసాగుతుండెను.
శ్రీల ప్రభుపాదుల వారి అత్యంత ప్రధాన సేవ గ్రంథరచన. దానికి వారు మిక్కిలి ఖ్యాతి గడించిరి. వారి గ్రంథాలు ప్రామాణికత్వముకు, జ్ఞానగంభీరతకు, స్పష్టతకు పేరుగాంచి, విద్వాంసుల చేత ఎంతగానో గౌరవించబడెను. అనేక కళాశాలల్లో, పాఠశాలల్లో ప్రామాణిక పాఠ్యగ్రంథములుగా వినియోగింప బడుతుండెను. వారి రచనలు ఎనభైకి పైగా భాషలలోకి అనువదించబడెను. ప్రభుపాదుల వారి గ్రంథములను ముద్రించి ప్రకటించుట కొరకే 1972లో భక్తివేదాంత బుక్ ట్రస్ట్ అనే సంస్థను స్థాపించిరి. అది ఇప్పుడు భారతీయ వైదిక తత్త్వవిషయములపై గ్రంథములను ప్రచురించే ప్రముఖ ప్రపంచ ప్రచురణ సంస్థగా రూపొందెను.
వార్థక్యము సమీపించినను, షుమారు పన్నెండు సంవత్సరములలో శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచమంతటా పదునాలుగుసార్లు ఉపన్యాసయాత్రను కొనసాగిస్తూ ఆరుఖండాలలో విస్తృత పర్యటనలు చేసిరి. అంతటి నిర్విరామ కార్యక్రమాలలో నెలకొనినప్పటికినీ వారు తమ గ్రంథరచనను కొనసాగిస్తూనే ఉండేవారు. వారి గ్రంథాలన్నింటినీ కలిపితే ఒక ప్రముఖ వైదిక వేదాంత సాహిత్య సంస్కృతి గ్రంథాలయమే అగును.
1977 నవంబరు 14న, ఉత్తరప్రదేశ్‌లోని వృందావనములో తిరోభవించు వరకు వారు నిర్విరామముగా శ్రమించిరి. ప్రపంచమంతటా వందకు పైగా ఆశ్రమములను, మందిరములను స్థాపించి కృష్ణచైతన్య సంఘమును అంతర్జాతీయ సంస్థగా (ఇస్కాన్‌గా) తీర్చిదిద్దిరి.
No Unauthorized Printing:
Printing or reproducing books from prabhupadatelugubooks.com without permission is forbidden and subject to legal consequences.